యూజీ కోసం యూఎస్-‘ఓపెన్ డోర్స్’ నివేదికలో వెల్లడి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై టారిఫ్‌ల మోత మోగించినా.. ఆ దేశంతో ఈమధ్యకాలంలో సంబంధాలు కాస్త క్షీణించినా.. ఇప్పటికీ చదువుల కోసం అమెరికావైపే చూసే యంగిస్థాన్‌ల సంఖ్య తగ్గడం లేదు. 2021-22లో 27,545 మంది, 2022-23లో 31,954 మంది, 2023-24లో 36,053 మంది అక్కడి విద్యాసంస్థల్లో డిగ్రీ(అండర్ గ్రాడ్యుయేట్-యూజీ)లో చేరగా.. 2024-25లో ఆ సంఖ్య 40,135కి పెరిగింది. అక్కడికెళ్లిన విద్యార్థుల్లో 43.40% మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే చేరడం విశేషం. 22% మంది ఇంజినీరింగ్, 2.60% మంది మాత్రమే సోషల్ సైన్సెస్‌లో ప్రవేశం పొందారు. అత్యధికంగా 44.40% మంది ఇరాన్ విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరారు. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చదువులపై ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్-2025 నివేదిక ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) కోర్సుల్లో ఆసియా విద్యార్థులే అత్యధికంగా ప్రవేశాలు పొందుతున్నట్లు.. ఐరోపా విద్యార్థులు ఎక్కువ ఒత్తిడి లేని కోర్సులు ఎంచుకుంటున్నారని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్స్ ఎండీ యు.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.
సాధారణంగా భారత్‌లో బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో సైన్స్, ఇంజినీరింగ్ కలిపే ఉంటాయి. అమెరికాలో మాత్రం ఈ రెండు సబ్జెక్టులు వేర్వేరు. యూఎస్‌లో ఎం.ఎస్. కంప్యూటర్ సైన్స్‌లో చేరే మన భారతీయులు దీనికోసమే కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి ఒకట్రెండు అదనపు సబ్జెక్టులు చదువుతారు. మొత్తమ్మీద మన విద్యార్థుల్లో 65 శాతానికిపైగా మంది కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్‌లోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఉన్నత చదువుల కోసం అత్యధికులు టెక్సాస్, న్యూయార్క్, మసాచ్యుసెట్స్, కాలిఫోర్నియా, ఇల్లినోయీ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. అందులో 63.10% మంది ప్రభుత్వ విద్యాసంస్థలు, 36.90% మంది ప్రైవేట్ వర్సిటీల్లో చేరుతున్నారు. అండర్‌గ్రాడ్యుయేట్స్ భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగగా, పీజీలో మాత్రం 1,96,567 నుంచి 1,77,892కి తగ్గింది. చదువు పూర్తైన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో చేరినవారి సంఖ్య 97,556 నుంచి ఏకంగా 1,43,740కి పెరగడం విశేషం.


Pratiroju 




