భార్యకు ములాయం కొడుకు విడాకులు- ప్రతీక్ యాదవ్ పోస్ట్ వైరల్- కాసేపటికే ట్విస్ట్!
లఖ్‌నవూలో రాజకీయ హైడ్రామా- భార్య అపర్ణా యాదవ్‌ను విమర్శించిన ములాయం చిన్న కొడుకు- ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన అపర్ణ- ఇదంతా హ్యాకర్ల పనేనని తేల్చేసిన పీఏ
ప్రముఖ రాజకీయ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఒక బాంబు పేల్చారు. తన భార్య, బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్ నుంచి తాను విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ పోస్ట్ వైరల్ అయిన కొద్దిసేపటికే కథలో అనూహ్య మలుపు తిరిగింది. ప్రతీక్ అకౌంట్ హ్యాక్ అయిందని అపర్ణ పీఏ ప్రకటించడం గందరగోళానికి దారితీసింది.
వైరల్ అయిన పోస్టులో ఏమున్నదంటే!
ప్రతీక్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో భార్యపై నిప్పులు చెరిగారు. "అపర్ణ ఒక స్వార్థపరురాలు. ఆమెను పెళ్లి చేసుకోవడం నా దౌర్భాగ్యం. నా జీవితంలో ఇలాంటి 'బ్యాడ్ సోల్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె మా కుటుంబ బంధాలను నాశనం చేసింది. ఆమె ఒక 'ఫ్యామిలీ డిస్ట్రాయర్'. ఆమెకు కేవలం కీర్తి, పరపతి, రాజకీయాలు మాత్రమే ముఖ్యం. నా మానసిక పరిస్థితి గురించి ఆమెకు ఏమాత్రం ఆందోళన లేదు. అందుకే ఈ నరకం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాను. ఈ బంధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అనుకుంటున్నాను" అని ప్రతీక్ ఆ పోస్టులో రాసుకొచ్చారు.


Pratiroju 




