భారతమాతను మోదీ సర్కార్ అమ్మేసింది- హోల్‌సేల్‌గా అమెరికాకు సరెండర్: లోక్​సభలో రాహుల్

లోక్​సభలో అమెరికా, భారత్ ట్రేడ్ డీల్​పై రాహుల్ గాంధీ విమర్శలు- ఒప్పందంలో అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు- కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ఘాటు వ్యాఖ్యలు

భారతమాతను మోదీ సర్కార్ అమ్మేసింది- హోల్‌సేల్‌గా అమెరికాకు సరెండర్: లోక్​సభలో రాహుల్

భారత్ - అమెరికా మధ్యంతర ట్రేడ్ డీల్ ద్వారా భారతమాతను కేంద్ర ప్రభుత్వం అమ్మేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారతదేశ ఇంధన భద్రతను అమెరికా చేతుల్లో పెట్టి, రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి సర్కారు హోల్‌సేల్‌గా సరెండర్ అయిపోయిందని ఆయన ఆరోపించారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. భారత్ - అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏకపక్షంగా ఉందని, దీనివల్ల భారత రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఈ ట్రేడ్ డీల్ అమల్లోకి వస్తే, భారత మార్కెట్‌లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవాహం భారీగా పెరుగుతుందని రాహుల్ తెలిపారు.

అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ధాటికి భారత రైతులు విలవిలలాడాల్సిన దుస్థితి వస్తుందన్నారు. ఇక భారతదేశ వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ఫలితంగా ఇంధన భద్రతను భారత్ కోల్పోయిందన్నారు. ఇకపై భారత్ ఎవరి నుంచి చమురును కొనాలో అమెరికాయే చెబుతుందని రాహుల్ పేర్కొన్నారు. ట్రేడ్‌ డీల్‌పై చర్చల సందర్భంగా, భారత్‌ను సరిసమాన భాగస్వామిగా పరిగణించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ను కేంద్ర ప్రభుత్వం కోరి ఉండాల్సిందన్నారు. ‘‘మీ ప్రభుత్వం భారతదేశాన్ని అమ్మేసింది. దేశాన్ని అమ్ముతున్నందుకు సిగ్గుగా లేదా ? మీరు భారత మాతను అమ్మేశారు’’ అని రాహుల్ కామెంట్ చేశారు.