బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య
ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవక ముందే మరో హిందువు హత్యకు గురయ్యాడు (Hindu worker shot by colleague). మయమన్సింగ్ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న బజేంద్ర బిశ్వాస్ (42)ను అతడి సహోద్యోగి నోమన్ మియా కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తాము ఇద్దరం ఫ్యాక్టరీ బారక్‌లో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో భద్రత కోసం ఉపయోగించే తుపాకీని బిశ్వాస్ వైపు గురిపెట్టానని..అనుకోకుండా చేయి ట్రిగర్కు తాకడంతో తుపాకీ పేలి, బుల్లెట్ అతడికి తగిలిందని నోమన్ మియా పేర్కొన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నోమన్ మియాను అరెస్టు చేశారు. బిశ్వాస్ మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న అల్లర్లలో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్‌పై అల్లరిమూకలు దాడి చేసి హత్య చేశాయి. అది మరవకముందే ఇటీవల మరో హిందూ యువకుడిని రాజ్‌బరి జిల్లా పంగ్షా సర్కిల్లో గ్రామస్థులు కొట్టి చంపారు. తాజాగా మరో హత్య జరగడంతో ఆ దేశంలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.


Pratiroju 




