ప్రతి నెల రూ.10 వేలు - అనాథ పిల్లలకు అండగా నిలచిన డిప్యూటీ సీఎం పవన్
తల్లిదండ్రుల్లేని చిన్నారులకు భరోసాగా డిప్యూటీ సీఎం - ఆదుకోవాలని వీడియో పోస్ట్ చేసిన ఇద్దరు పిల్లలకు సాయం చేసిన పవన్, ప్రతి నెలా చెరో రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందించాలని ఆదేశాలు
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా సాయం చేయాలని తనను సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా సంప్రదించిన వారి సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. ఇలా గతంలో ఎంతోమందికి సాయం అందించారు. అదేవిధంగా అనేక గ్రామాలకు రోడ్లు సైతం నిర్మించి సమస్యలు పరిష్కరించారు. తాజాగా తల్లిదండ్రులు లేరని, తమను ఆదుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా చిన్నారులు చేసిన విజ్ఞప్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కదిలించింది. ఆదుకోవాలని వీడియో తీసి పోస్ట్ చేసిన వారికి నేరుగా బాధ్యత వహిస్తూ ఇద్దరు చిన్నారులకు ప్రతి నెలా చెరో రూ.5000 చొప్పున మొత్తంగా రూ.10,000ను ఇవ్వాలని అధికారులకు పవన్ ఆదేశించారు.
చెరొక రూ.5000 ఇవ్వాలని ఆదేశం: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లు సత్య, చంటిలు రెండేళ్ల క్రితం తమ తండ్రిని కోల్పోయారు. రెండు నెలల క్రితం తమ తల్లి సైతం క్యాన్సర్‌తో కన్నుమూసింది. దాంతో నిరాదరణకు గురైన తమను ఆదుకోవాలని ఫోన్లో వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అనంతరం ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వెళ్లింది. అందుకు అనుగుణంగా పవన్ స్పందించి ఇద్దరికీ ప్రతి నెలా చెరొక ఐదు వేలు చొప్పున మొత్తంగా 10 వేలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
వీరిలో కుమార్తె సత్య ఇంటర్ పూర్తి చేయగా, కుమారుడు చైతన్య 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ దృష్టికి ఈ విషయం చేరడంతో వ్యక్తిగతంగా సైతం డబ్బులను పంపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా ఇల్లు కట్టించి ఇద్దరి పిల్లలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలో నేర్పించాలని కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగిస్తూ తాజాగా ఆదేశాలను జారీ చేయడం గమనార్హం.
గతంలోనూ: తాను ప్రాతినిథ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఓ పక్క అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తూనే మరోవైపు దాతృత్వ సేవలను డిప్యూటీ సీఎం పవన్ అందిస్తున్నారు. గతంలో సైతం పవన్ ఆదేశాలతో నియోజకవర్గంలో మొత్తం 42 మంది అనాథ పిల్లలకు ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున జనసేన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అందించారు. ఈ పిల్లలకు నగదు చెల్లింపులుగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కు వచ్చేటటువంటి తన జీతంలో నుంచి తీసి ఇవ్వడం గొప్ప విషయం. ఈ పరంపరలోనే మరో ఇద్దరు చిన్నారులకు అండగా ఉండటం పవన్ దాతృత్వ హృదయానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.


Pratiroju 




