దావోస్ ఒప్పందాల్లో 60 శాతం కార్యరూపం
దావోస్‌లో చేసుకున్న ఒప్పందాల్లో 60 శాతం కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అందుకే మొదటిసారే రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.2.71 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదిరాయన్నారు.
సానుకూల దృక్పథంతో కష్టపడితే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం అసాధ్యం కాదన్నారు. మంగళవారం శాసనసభ, మండలిలో ‘తెలంగాణలో కొత్త పరిశ్రమలు’ అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగానూ మంత్రి మాట్లాడారు. ‘‘దావోస్ పర్యటనలో నేను కూడా సీఎం రేవంత్‌రెడ్డి వెంట ఉన్నాను. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎలాంటి హామీ ఇస్తుందని పారిశ్రామికవేత్తలు అడిగారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను కొనసాగిస్తామని, రాష్ట్ర ఆర్థిక రంగాన్ని మెరుగుపరిచేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వబోం. మా విధానాల వల్లే విప్రో, కాగ్నిజెంట్ వంటి అనేక సంస్థలు తమ సామర్థ్యం పెంచుకున్నాయి. తద్వారా 1.78 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ 13% అభివృద్ధి సాధించి తీరుతాం. 100 జీసీసీల ఏర్పాటు లక్ష్యం: గ్లోబల్ సమిట్‌లో రూ.5.77 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. నిరుడు 70 జీసీసీలు ఏర్పాటు కాగా... ఈసారి 100 జీసీసీల ఏర్పాటు లక్ష్యంతో ఉన్నాం. ఐటీ పరిశ్రమలకు డిమాండ్ దృష్ట్యా పీపీపీ విధానంలో త్వరలో అంతర్జాతీయ హంగులతో ఐటీ పార్క్‌లు నిర్మించబోతున్నాం. 2004 నుంచి 2014 వరకు రూ.55 వేల కోట్లున్న ఐటీ ఎగుమతులు... తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో రూ.2 లక్షల కోట్లకు చేరాయి. గత రెండేళ్లలో రూ.2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై ఒత్తిడి తగ్గించేందుకు బండ రావిర్యాల, ప్యారానగర్‌లలో కొత్త యార్డులు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనేందుకు లగచర్ల ఉదంతమే ఉదాహరణ. అయినా చిత్తశుద్ధితో పనిచేస్తూ... పరిశ్రమల ద్వారా రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలను కల్పించాం’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.
శాసనసభలో భాజపా సభ్యుడు పాల్వాయి హరీశ్ (సిర్పూరు) మాట్లాడుతూ... తెలంగాణ రైజింగ్‌లో పేర్కొన్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమో వివరించాలన్నారు. స్థూల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 13% చొప్పున నికరంగా కొనసాగితే తప్ప ఇది సాధ్యం కాదని, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత అభివృద్ధి సాధించలేదన్నారు. రూ.వేల కోట్ల ఒప్పందాలు జరిగినా వాస్తవంగా ఎన్ని కార్యరూపం దాల్చాయో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు.


Pratiroju 




