తిరుమలలో ఏడు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న మలయప్పస్వామి-25న రథసప్తమి -

తిరుమలలో ఏడు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న మలయప్పస్వామి-25న రథసప్తమి -

సూర్యజయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్పస్వామి దర్శనమిస్తుండటంతో ఈ వేడుకను ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తుంటారు. ఈ ఏడాది రథసప్తమి ఆదివారం రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు వస్తారనే ఆంచనాతో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.

వాహన సేవల వివరాలు:
తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటలు: సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటలు: చిన్నశేష వాహనం
11 నుంచి మధ్యాహ్నం 12 గంటలు: గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలు: హనుమంత వాహనం
2 నుంచి 3 గంటలు: చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటలు: కల్పవృక్ష వాహనం
6 నుంచి రాత్రి 7 గంటలు: సర్వభూపాల వాహనం
8 నుంచి 9 గంటలు: చంద్రప్రభ వాహనం

ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు: రథసప్తమిని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఎన్‌ఆర్‌ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రివిలేజ్‌ దర్శనాలు రద్దు చేశారు. తిరుపతిలో ఈ నెల 24 నుంచి 26 వరకు స్లాటెడ్‌ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు, బ్రేక్‌ దర్శనాలకు సంబంధించి జనవరి 24న సిఫార్సు లేఖలు స్వీకరించరు.

రథ సప్తమి ప్రత్యేకత: సూర్యరథానికి కూర్చిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు, పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం. శనివారంతో వారాంతమవుతుంది. మేషం నుంచి మీనం దాకా పన్నెండు రాశుల్ని పూర్తి చేయడానికి, సూర్యరథానికి ఒక ఏడాది పడుతుందంటారు. ఒకే సూర్యుడు పన్నెండు రూపాలు, పన్నెండు పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్‌ పురుషుడి నేత్రావధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేదవాక్యాన్ని అనుసరించి- ఉత్తరాయణం పుణ్యకాలంలా, ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్యపై ఎదురుచూశారు.

రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు: రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతి కాంతి సొగసులు సంతరించుకుంటుంది. పంటల పండుగ సంక్రాంతి తరవాత అవతరించే రథం పండుగ ఇది. రథ సప్తమినాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల నడుమ పిడకలు వేసి, సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. పిడకలపైన పాలు పొంగించడాన్ని "సిరుల పొంగు"కు సంకేతంగా భావిస్తారు. అప్పటికే రైతులు ధాన్య రాశులను ఇళ్లకు చేర్చి ఉంటారు. ఉదయాన్నే ఇంటిల్లిపాదీ స్నానాలు ముగిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేస్తుంటారు.

జీవరాశికి ఉత్తేజాన్ని ప్రసాదించేది సూర్యుడు: జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించేది సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అని సూర్యమండలాష్టకమ్‌ చెబుతుంది. 'జయాయ జయ భద్రాయ' అంటుంది ఆదిత్య హృదయం. శరీరయాత్రలో జీవుడు చేసే కర్మలన్నింటికీ సాక్షీభూతుడు సూర్యుడు. బాహ్యప్రపంచాన్ని వెలిగించడంతో పాటు, అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం రవి బింబం. ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ని ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథ సప్తమినాడు పూజలందుకుంటున్నాడు. సూర్యుడి దేవాలయాల్లో కోణార్క్‌, విరించి నారాయణ క్షేత్రాలు (ఒడిశా); మొధేరా (గుజరాత్‌) ప్రఖ్యాతమైనవి. విదేశాల్లోనూ సూర్యారాధన సాగుతోంది. అందుకు చైనా, జపాన్‌, ఈజిప్టులు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.