జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘం 2026 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ కమిషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు రెట్టింపు కానున్నాయి. వేతన పెంపు, పెన్షన్లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి కీలక అంశాల ఆధారంగా ఒక్కో ఉద్యోగి వేతనం అమాంతం పెరగనుంది. జనవరి 1వ తేదీ నుండి వారి జీతభత్యాల్లో ఈ పెరుగుదల ఉండబోతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 8వ వేతన సంఘానికి ఇదివరకే ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, భత్యాలతో పాటు కరువు భత్యం (డీఏ)ను కూడా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి ఉద్దేశించినది. ఉద్యోగుల జీతాలు, రిటైర్‌మెంట్ పెన్షన్లను ఎప్పటికప్పుడు సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాలను ఏర్పాటు చేస్తుంది.

ఈ పే కమిషన్ (8th Pay Commission) లో ప్రతిపాదించిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి ఒక్కో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస మూల వేతనం రూ. 18,000 నుండి రూ. 51,480 వరకు పెరిగే అవకాశం ఉంది. రక్షణ శాఖతో కలిపి దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ ఫిట్మెంట్ ప్రకారం.. సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

కొత్త ఆర్థిక చట్టం 2025 కింద కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కరువు భత్యం పెంపు ఆగిపోతుందని ఇదివరకు వచ్చిన వార్తలను కేంద్రం తోసిపుచ్చింది కూడా. దీనిపై ఇప్పటివరకు నెలకొన్న అనిశ్చితిని తొలగించినట్టయింది. ఆ వార్తలను నిరాధారమైనవని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు దురుసు ప్రవర్తన కారణంగా తప్ప డీఏ పెంపు, వేతన సంఘాల సవరణలు వంటి రిటైర్‌మెంట్ అనంతర ప్రయోజనాలు ఆపబోమని వివరించారు.