కొత్త బండి కొంటున్నారా? - ఇక RTO ఆఫీస్​తో పనిలేదు - షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌?

కొత్త బండి కొంటున్నారా? - ఇక RTO ఆఫీస్​తో పనిలేదు - షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌?

తెలంగాణలో రవాణా శాఖ చెక్‌పోస్టులు ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ శాఖలో మరో కీలక సంస్కరణ అమలు దిశగా సిద్ధమవుతోంది. ప్రస్తుతం కొత్తగా వ్యక్తిగత వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.

హైసెక్యూరిటీ ప్లేట్ కోసం మళ్లీ డీలర్​ దగ్గరకు : రాష్ట్రంలో సగటున ఏటా 6.03 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వాహనం కొన్నప్పుడు షోరూం డీలర్‌ సిబ్బంది తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) చేస్తున్నారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీవో కార్యాలయానికి కొత్త వాహనం తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ వేసుకోవడానికి మళ్లీ డీలర్‌ దగ్గరికి వెళ్లాలి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ పరిధిలోని ‘వాహన్, సారథి’ పోర్టళ్లలో పలు రాష్ట్రాలు ఎన్నో ఏళ్ల కిందటే చేరి షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు సహా పలు సరికొత్త విధానాల్ని అమలు పరుస్తున్నాయి.

ఫ్యాన్సీ నంబర్​ కావాలంటే ఆగాల్సిందే : రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ‘సారథి’ని అమలు చేస్తున్నా, వాహన్‌ విషయంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. వాహన్‌ పోర్టల్​ను త్వరగా అమలు చేయాలని మంత్రి పొన్నం అధికారులకు స్పష్టం చేశారు. వాహన కొనుగోలుదారుడి వివరాల్ని డీలర్‌ ఈ పోర్టల్‌లో నమోదు చేస్తారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసుకునే ముందు రవాణా శాఖ అధికారి డిజిటల్‌ అప్రూవల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వ్యక్తిగత వాహనానికి సాధారణ నంబర్‌ కావాలనుకుంటే వాహనం కొన్న సాయంత్రంలోపు, తప్పితే మరుసటి రోజు రిజిస్ట్రేషన్‌ వేగంగా పూర్తవుతుంది. అదే ఫ్యాన్సీ నంబర్‌ కావాలంటే రవాణా శాఖ ఆ సిరీస్‌ను విడుదల చేసేంత వరకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అదే వాణిజ్య అవసరాల కోసం కొన్న వాహనాలైతే రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీవో కార్యాలయానికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే.

ప్రస్తుతం అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేటు కలిగి ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పుడున్న వాటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నంబర్ ప్లేట్‌ ఎలా పొందాలి, ఎవరిస్తారు, ఎక్కడికి వెళ్లాలి అనే దానిపై ఇకపై సందేహాలు అవసరం లేదు. www.siam.in అనే వెబ్‌సైట్‌ ఆధారంతో వీటిని పొందే అవకాశం ఉంది. వెబ్​సైట్​ తెరిచిన తర్వాత అందులో హెచ్‌ఎస్‌ఆర్పీ రిజిస్ట్రేషన్‌ను ఎంచుకోవాలి. మన వాహన వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్‌ చేసుకోవాలి. వాటి ఆధారంగా తగిన ఫీజు చెల్లిస్తే నంబర్ ప్లేటు మనం ఎంచుకున్న చిరునామాకే నేరుగా వస్తుంది. ఆ తర్వాత దాన్ని మన వాహనానికి బిగించుకుని, ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

హెచ్​ఎస్​ఆర్పీ ఉండాల్సిందే : 1 ఏప్రిల్‌ 2019 తర్వాత రిజిస్టర్‌ అయిన వాహనాలన్నింటికీ హెచ్‌ఎస్‌ఆర్పీ (హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌) షోరూంలలో బిగిస్తున్నారు. ఈ విషయంలో అంతగా ఇబ్బందులు అంతగా లేవు. ఎటొచ్చీ అంతకన్నా ముందుగా రిజిస్టర్‌ అయిన వాహనాలకే తాజా నిబంధన వర్తించనుంది. వాహనం ఏదైనా, ఎప్పటిదైనా విధిగా హెచ్‌ఎస్‌ఆర్పీ కలిగి ఉండాల్సిందే.

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేటు ఉంటేనే సదరు వాహనానికి సంబంధించి బీమా, సామర్థ్యం, పొల్యూషన్ పత్రాలతో పాటు రవాణా శాఖ నుంచి ఇతర సేవలను పొందే వీలు ఉంటుంది. సాధారణ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు బిగించుకుంటేనే మంచిది. లేదంటే ఆ వాహనాలకు బీమా, రిజిస్ట్రేషన్, కాలుష్య సర్టిఫికెట్​ ఇతర సేవలు నిలిపివేసే అవకాశం కూడా ఉంది. వాటిని కొనాలన్నా, అమ్మాలన్నా ఇకపై పలు ఇబ్బందులు మాత్రం తప్పవు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది.