కేరళలో అసెంబ్లీలోనూ గవర్నర్ వివాదం- ప్రసంగంలో కొన్ని పేరాలు చదవలేదన్న సీఎం

మంగళవారం ప్రారంభమైన కేరళ అసెంబ్లీ సమావేశాలు- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో కొన్ని అంశాలను గవర్నర్ చదవలేదన్న పినరయి

కేరళలో అసెంబ్లీలోనూ గవర్నర్ వివాదం- ప్రసంగంలో కొన్ని పేరాలు చదవలేదన్న సీఎం

కేరళలో మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్​ రాజేంద్ర విశ్వనాథ్​ అర్లేకర్​ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో కొన్ని అంశాలను చదవలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్​ పేర్కొన్నారు. అర్లేకర్​ సభ నుంచి నిష్క్రమించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రసంగంలో 12వ పేరా నుంచి 15 పేరా వరకు చదవలేదని స్పీకర్​కు వెల్లడించారు. గవర్నర్​ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

ముఖ్యమైన అంశాలను విస్మరించారు!
ప్రసంగం అనంతరం గవర్నర్​ సభనుంచి వెళ్లిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగించని పేరాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే కొన్ని ముఖ్యమైన అంశాలున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం, పెండింగ్​ బిల్లులు వంటి అంశాలను గవర్నర్​ విస్మరించినట్లు తెలిపారు. 12వ పేరాలో సమాఖ్య విధానం, కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి, 15వ పేరాలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం వంటి విషయాలున్నట్లు ఆయన చెప్పారు. అయితే, వాటి గురించి గవర్నర్​ ప్రసంగించకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి, సభా పద్ధతులకు విరుద్ధమని అన్నారు. గవర్నర్ విస్మరించిన అంశాలను జోడించి మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని ప్రామాణిక పత్రంగా అంగీకరించాలని స్పీకర్​ను అభ్యర్థించారు.

కేంద్రంపై విమర్శలు గుప్పించిన విజయన్
మరోవైపు, కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి విజయన్​ విమర్శలు గుప్పించారు. ఆర్థిక సమాఖ్య విధానం, రాజ్యాంగ విలువలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఫలితంగా కేరళ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్​లో ఉన్నాయని, ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అయితే అందుకు సంబంధించిన విషయాలు 12, 15వ పేరాలో ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే సభా నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని స్పీకర్​ తెలిపారు. కొన్ని అంశాలను వదిలేస్తూ గవర్నర్​ చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమన్నారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగం కాపీలను మీడియాకు అందజేయాలని స్పీకర్​ ఆదేశించారు.