సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా - చీరాలలో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు
బొమ్మల కొలువును ఏర్పాటు చేసిన కొణికి కుటుంబం - బొమ్మల కొలువులో వందలాది బొమ్మలు సేకరణ - తాతల కాలం నుంచి బొమ్మల కొలువుకు శ్రీకారం - కొలువులో 1500 వరకు బొమ్మలు
రంగురంగుల రంగవల్లులూ, భోగి మంటలూ, భోగి పండ్లూ, హరిదాసుల సంకీర్తనలూ, గొబ్బెమ్మలూ, గంగిరెద్దులూ, గాలిపటాలూ, కోడి పందేలు, నోరూరించే పిండి వంటలు, పొట్టేళ్ల పందేలు వీటితో పాటు బొమ్మల కొలువులు అన్నీ కలిస్తేనే పెద్ద పండుగ. అదే సంక్రాంతి. సంవత్సరం తొలినాళ్లలో పవిత్ర ధనుర్మాసంలో మూడు రోజుల పాటు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది.
బాపట్ల జిల్లా చీరాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దేశ విదేశాల నుంచి సొంత ఊళ్లకు వచ్చిన వారితో లోగిళ్లు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. నగరంలో ఓ కుటుంబం ప్రతి ఏటా బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అసలు ఎవరు వారు? వారి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొమ్మల కొలువు ఏర్పాటు : బాపట్ల జిల్లా చీరాలలోని వైకుంఠపురంలో కొణికి వారి ఇంట ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొణికి చంద్రశేఖర్, సావిత్రీదేవి, వీరి ముగ్గురు కుమార్తెలు సుష్మ, శ్రావ్య, వైష్ణవి ప్రతి ఏటా అందమైన బొమ్మల అలంకారంతో బొమ్మల కొలువును ఇక్కడ నిర్వహిస్తున్నారు. ముంగిట్లో ఓ పక్కన పల్లె సౌందర్యం, రైతుల శ్రమైక జీవితం, పండుగ విశేషాలకు అద్దంపట్టే అందమైన బొమ్మలను కొలువుతీర్చి పిల్లలకు మన సంప్రదాయాలతో పాటు విలువలను చెప్పకనే చెబుతున్నారు.
రమణీయత ఉట్టిపడేలా : విశేషంగా ఆకర్షిస్తున్న కొణికి వారి బొమ్మల కొలువు చూడముచ్చటగా కనువిందు చేస్తోంది. ప్రతి ఏటా వీరి ఇంట కొలువు తీరిన బొమ్మల కొలువు రమణీయత ఉట్టిపడే అద్భుత సంబరంగా మారింది. వందలాది బొమ్మలు సేకరించి ఆ ఇంట ప్రదర్శించటం అనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండగ దినాల్లో ప్రత్యేక ఆకర్షణీయమైన బొమ్మల కొలువు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
తాతల కాలం నుంచి బొమ్మల కొలువు : సంక్రాంతిలో కనిపించే ఈ సంస్కృతికి తమ తాతల కాలం నుంచి బొమ్మల కొలువుకు శ్రీకారం చుట్టామంటున్నారు. ఈ బొమ్మల కొలువులో వివిధ రకాల మట్టి బొమ్మలు, రామాయణం, భారతం, వివాహ వ్యవస్థ తెలిపే ఘట్టాలు, వివిధరకాల దేవుళ్ల బొమ్మలు చూడముచ్చటగా కొలువుతీరాయి. విహారయాత్రకు వెళ్లిన ప్రతిసారి కొన్నిబొమ్మలు తీసుకురావటం, అనేక బొమ్మలను సేకరించడం, ఇంట్లో ప్రదర్శనగా ఉంచటం చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని బొమ్మలతో ప్రారంభించిన ఈ బొమ్మల సేకరణ ప్రస్తుతం దాదాపు 1500 వరకు బొమ్మల వరకు కొలువుతీరాయి.
సంస్కృతి సంప్రదాయాలను తెలియచెప్పేందుకు : ప్రకృతి రమణీయతను ఉట్టిపడే అందాలు, ఆరుగాలం శ్రమించే అన్నదాతలు, అంధంగా కనిపించే రమణీయ దృశ్యాలు, దేవాలయాలు, పంచతంత్రం కధలు తెలిపే బొమ్మలు, దేవుళ్ల బొమ్మలు, పల్లె వాతావరణం ప్రతి బింబించేలా దృశ్యాలు, అందమైన బొమ్మలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు తెలియచెప్పేందుకు బొమ్మల కొలువు తీర్చిదిద్దామని తెలిపారు. సంక్రాంతి పండుగకు ఐదు రోజుల ముందు నుంచే ఎంతో శ్రమించి బొమ్మలను వరుసగా అమరుస్తామని చెప్పారు.
ప్రతి ఏటా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలలో బొమ్మలు ప్రదర్శిస్తున్నామని, బొమ్మలు అమర్చటం, దాని తరువాత జాగ్రత్తగా దాచిపెట్టటం కష్టమైనాసరే తెలుగు సంప్రదాయాలను ముందు తరాలకు చాటి చెప్పటం తమ ఉద్దేశ్యమని వారు పేర్కొన్నారు. వందల మంది బొమ్మల కొలువును పురప్రజలు తిలకిస్తుంటే తాము పడ్డ శ్రమను మర్చిపోతామని కొణికి కుటుంబం తెలిపారు. బొమ్మల కొలువును తిలకించేందుకు పెద్దయెత్తున చుక్కుపక్కలవాళ్లు, చీరాల పట్టణంలోని ప్రముఖులు హాజరై హర్షం వ్యక్తం చేశారు. పురాణాలు, ఇతిహాసాలు తెలిసే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.


Pratiroju





