రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: వైట్​హౌస్ ప్రకటన

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: వైట్​హౌస్ ప్రకటన

నాటో కూటమిలో పెరుగుతున్న చీలిక- గ్రీన్‌లాండ్‌పై బెట్టువీడని ప్రెసిడెంట్ ట్రంప్- గ్రీన్‌లాండ్‌ను అమెరికా తీసుకుంటామంటే కుదరదు అంటున్న ఐరోపా దేశాలు - దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు వైపు అందరి చూపు

నాటో కూటమిలో చీలిక క్రమంగా పెరుగుతోంది. డెన్మార్క్‌ దేశంలోని గ్రీన్‌లాండ్‌ ద్వీపంపై అమెరికా వైట్‌హౌస్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇక రష్యా ముప్పు నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తిని కల్పిస్తామని వెల్లడించింది. రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌‌కు ముప్పు ఉందని గత 20 ఏళ్లుగా నాటో కూటమి చెబుతున్నా డెన్మార్క్ పట్టించుకోలేదని ఆరోపించింది. గ్రీన్‌లాండ్ భద్రత కోసం ఇప్పటిదాకా డెన్మార్క్ ఏమీ చేయలేకపోయిందని వైట్‌హౌస్ పేర్కొంది. ఇక గ్రీన్‌లాండ్‌కు భద్రత కల్పించే సమయం వచ్చేసిందని, ఆ పనిని చేస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు సందేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ క్లిప్పింగ్‌తో వైట్‌హౌస్ సోమవారం ఉదయం ఈ ట్వీట్ చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి జనవరి 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా ట్రంప్‌తో నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ ర్యూట్ భేటీ కానున్న వేళ వైట్‌హౌస్ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.