ఒక్కరోజే రూ.27.68 కోట్ల ఆదాయం ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త రికార్డు -

ఒక్కరోజే రూ.27.68 కోట్ల ఆదాయం ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త రికార్డు -

సంక్రాంతి రిటర్న్​ జర్నీలో రికార్డ్​ - చరిత్రలో ఎప్పుడూ లేనిరీతిలో ఒకేరోజు అత్యధిక ఆదాయం - ఒక్కరోజే అత్యధికంగా 50.6 లక్షల ప్రయాణికులను చేరవేసిన ఆర్టీసీ.

సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాలతో నిన్న (సోమవారం) ప్రయాణ ప్రాంగణాలు పోటెత్తాయి. ఆర్టీసీ బస్టాండ్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. బస్టాండ్​కు వచ్చిన ప్రతి ప్రయాణికుడిని గమ్యస్థానం చేర్చడం కోసం ఆర్టీసీ పెద్ద ఎత్తున నిరంతరాయంగా బస్సులు నడిపింది. ఫలితంగా ఆదాయార్జనలో ఏపీఎస్‌ ఆర్టీసీ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఒకేరోజు అత్యధిక ఆదాయం సాధించి రికార్డు: సంక్రాంతి రద్దీ నేపథ్యంలో జనవరి 19న ఒక్కరోజే సంస్థకు 27.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఒకేరోజు అత్యధిక ఆదాయం సాధించి రికార్డు సాధించింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 50 లక్షల 60 వేల మంది ప్రయాణికులని గమ్యస్థానాలకు ఆర్టీసీ చేరవేసింది. ఆర్టీసీ చరిత్రలో ఒకేరోజులో ఇంత ఆదాయం ఆర్జించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రికార్డు నమోదు చేయడం పట్ల డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్​వైజర్లు, అధికారులని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు.

సంక్రాంతి ప్రయాణాలు ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనవరి 8 నుంచి 19 వరకు నడిపిన బస్సు సర్వీసులకు రూ.18.19 కోట్ల మేర ఆదాయం వచ్చింది. స్త్రీశక్తి నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే రాబడి భారీగా పెరిగింది. సెలవులకు ముందు, తర్వాత వారాంతాలు రావడం కూడా ఆర్టీసీకి కలిసొచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పండగకు ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సగటున రోజుకు 735 ప్రత్యేక బస్సులు నడిపారు. ఇవి కాక 1,012 వరకు సాధారణ సర్వీసులు తిప్పారు. ఆర్టీసీ బస్సులు సుమారు 40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. జనవరి 10 నుంచి 13 వరకు అదనపు బస్సులు కేటాయించారు. ఈ రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు 1,000 బస్సులు తిరిగాయి. రోజుకు రూ.1.5 నుంచి రూ.2 కోట్ల ఆదాయం వచ్చింది. సెలవులకు అనుబంధంగా వారాంతాలు రావడంతో ఎక్కువ రోజులు ప్రత్యేక బస్సులను నడిపే అవకాశం వచ్చింది. దీంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖ, రాయలసీమ తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపారు.

ఇదిలా ఉండగా మరోవైపు ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో పండగ రద్దీ ఇంకా కొనసాగుతోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సంక్రాంతి రద్దీని ఆసరా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్‌ నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు దాడులు చేస్తున్నా రెండు, మూడు రెట్లు అదనంగా టికెట్‌ ధర పెంచి కాసుల వర్షం కురిపిస్తున్నారు. పట్టణ వాసులు వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో స్థిరపడ్డారు. వారంతా సొంతూర్లకు చేరుకుని సంక్రాంతి పండగ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి వసూలు చేస్తున్నారు.

వారిలో మార్పు రావడం లేదు: అధిక ఛార్జీల వసూలు పై నెల్లూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి, ఎంవీఐలు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఏకంగా 45 బస్సుల పై కేసులు నమోదు చేసి రూ.4.50 లక్షలు, సోమవారం 70 బస్సుల పై కేసులు పెట్టి రూ.7 లక్షల జరిమానా విధించారు. అయినప్పటికీ వారిలో ఏ విధమైనా మార్పు రావడం లేదు. ఇష్టానుసారంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా తగినన్ని అందుబాటులో లేకపోవడంతో రద్దీగా వెళుతున్నాయి.