శుభ్‌మన్ గిల్ తిరిగి టీ20 జట్టులోకి వస్తాడు: హర్భజన్ సింగ్
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ 2026కు సంబంధించి భారత జట్టును (Team India) ఇటీవలే బీసీసీఐ (BCCI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే జట్టు న్యూజిలాండ్‌తో జరగనున్న అయిదు టీ20ల సిరీస్‌లోనూ ఆడనుంది. అనూహ్యంగా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన వైస్ కెప్టెన్సీతో పాటు, జట్టులో స్థానాన్నీ కోల్పోయాడు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గిల్ టీ20 మ్యాచుల్లో వరుసగా వైఫల్యమవుతున్నందున బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh).. శుభ్‌మన్ గిల్‌కు మద్దతుగా నిలిచాడు. అతడు కచ్చితంగా తిరిగి టీ20 జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశాడు.
‘టీమ్ఇండియాకు ఎంపిక విషయంలో తీవ్రమైన పోటీ ఉన్న విషయం వాస్తవమే. అయితే గిల్‌కు దారులన్నీ మూసుకుపోయినట్లు కాదు. అతడు తిరిగి టీ20 జట్టులోకి వస్తాడు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. అతడు కచ్చితంగా పునరాగమనం చేస్తాడు. అలాగే గిల్ టెస్ట్ కెప్టెన్ అన్న విషయం మరిచిపోకూడదు.’ అని హర్భజన్ సింగ్ అన్నాడు.
‘కాంబినేషన్ వల్ల గిల్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వివరణ ఇచ్చారు. పరిస్థితులు, కాంబినేషన్ వల్లే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. గిల్ ఒక క్లాస్ ప్లేయర్. అతడు జట్టులోకి తిరిగి వస్తాడన్న విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్.. రాబిన్ ఉతప్ప (Robin Uthappa) సైతం ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా శుభ్‌మన్ గిల్ టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక కాకపోవడం గురించి మాట్లాడాడు. ‘వరల్డ్ కప్ నేపథ్యంలో జట్టులో ఫామ్‌లో లేని ఒక్క ఆటగాడిని మాత్రమే కొనసాగించవచ్చు. అంతకంటే ఎక్కువమందిని తీసుకోలేం. సూర్యకుమార్‌యాదవ్ ఈ మధ్య అంతగా పరుగులు చేయడం లేదు. అందుకే శుభ్‌మన్ గిల్ జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చిందని నా అభిప్రాయం’ అని ఉతప్ప అన్నాడు.


Pratiroju 




