వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్‌ సంచలన పోస్ట్‌

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్‌ సంచలన పోస్ట్‌

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా (Trump posts Venezuela) ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్‌ చేశారు. వికీపీడియా పేజీని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్‌ ఫొటో అది. అందులో ట్రంప్‌ (Donald Trump) ఫొటో కింద.. ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో ఇటీవల వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులకు దిగిన సంగతి తెలిసిందే. రాజధాని కారకాస్‌పై విరుచుకుపడిన అగ్రరాజ్య బలగాలు.. ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను నిర్బంధించి అమెరికాకు తరలించాయి. ఈ పరిణామాల అనంతరం వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్‌ డెల్సీ రోడ్రిగ్జ్‌ బాధ్యతలు చేపట్టారు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని వెనెజువెలా రక్షణమంత్రి వెల్లడించారు.

ఈ క్రమంలోనే వెనెజువెలా పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆ దేశ విపక్ష నేత, నోబెల్‌ పురస్కార గ్రహీత మచాడోను ఎన్నుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆమెకు బాధ్యతలు ఇచ్చేందుకు ట్రంప్‌ విముఖత చూపించడం గమనార్హం. మచాడోకు ప్రజల్లో అంత మద్దతు లేదని అమెరికా అధ్యక్షుడు ఇటీవల అన్నారు. ఈ పరిణామాల వేళ తాజాగా తానే తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్‌ ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది.