విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ - ప్రారంభించిన మంత్రి లోకేశ్​

విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ - ప్రారంభించిన మంత్రి లోకేశ్​

Mangalagiri Digi Library : ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, వేటికైనా సంబంధిత అంశాలపై విద్యార్థులు పట్టు సాధించటం తప్పనిసరి. దీని కోసం ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ఆధారపడేది గ్రంథాలయాల పైనే. ప్రస్తుతం సాంకేతికత రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ గ్రంథాలయాలూ రూపు మార్చుకుంటున్నాయి. ఆన్‌లైన్ పుస్తకాలకు, ఇంటర్నెట్​ ద్వారా లభ్యమయ్యే సమాచారానికి ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. అందుకే డిజిటల్ లైబ్రరీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి లోకేశ్​ చొరవతో మంగళగిరిలో విద్యార్థులు, యువత, ఉద్యోగార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ ప్రారంభమైంది.

డిజిటల్ నాలెడ్జ్ కేంద్రంగా లైబ్రరీ : మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో యువత ఉద్యోగాలు సాధించేలా మంత్రి లోకేష్‌ ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులు, యువత కోసం స్థానిక గ్రంథాలయానికి ఆధునిక హంగులు కల్పించారు. మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా సంప్రదాయ లైబ్రరీ భవనాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేసి, డిజిటల్ నాలెడ్జ్ కేంద్రంగా లైబ్రరీని మార్చారు. ఇటీవలే లోకేష్ మంగళగిరిలో ఈ లైబ్రరీని ప్రారంభించారు. కేవలం గ్రంథాలయమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, కెరీర్ నిర్మాణం, ఉద్యోగ పరీక్షలకు సిద్ధం చేసేలా ఈ లైబ్రరీని తీర్చిదిద్దారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం మొదటి అంతస్తులో హాల్‌తో పాటు రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షల పుస్తకాల విభాగంలో UPSC, APPSC, SSC, బ్యాంకింగ్, రైల్వేతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన సమాచారం, మెటీరియల్‌ను, పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడే డిజిటల్ లైబ్రరీని కూడా అందుబాటులోకి తెచ్చారు.