వాట్సప్‌లో ‘కొత్త’ ఫీచర్లు.. 2026 స్టిక్కర్స్‌, వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్‌!

వాట్సప్‌లో ‘కొత్త’ ఫీచర్లు.. 2026 స్టిక్కర్స్‌, వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్‌!

WhatsApp features | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ వాట్సప్‌ (Whatsapp) పలు కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలను మరింత ఆనందంగా జరుపుకొనేందుకు వీటిని తెస్తున్నట్లు తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. 2026 స్టిక్కర్‌ ప్యాక్‌తో పాటు వీడియో కాల్స్‌లో ఎఫెక్ట్స్‌ వంటి ఫీచర్లను తెస్తున్నట్లు తెలిపింది. సాధారణ రోజుల్లో తమ వేదిక ద్వారా 100 బిలియన్‌ సందేశాలు, 2 బిలియన్‌ కాల్స్‌ జరుగుతాయని వాట్సప్‌ పేర్కొంది. న్యూఇయర్‌ రోజు మాత్రం ఈ విషయంలో ఏటా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయని, ఈసారి కూడా సరికొత్త రికార్డలు నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ఫీచర్లను జోడిస్తున్నామని, ఆ రోజంతా ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని వాట్సప్‌ పేర్కొంది.

కొత్త ఫీచర్లు ఇవే..

  • కొత్త ఏడాది సందర్భంగా వాట్సప్‌లో 2026 స్టిక్కర్‌ ప్యాక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మీ బంధువులు, స్నేహితులకు న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌ చెప్పేందుకు ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయి. వీటిని వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌లలో వినియోగించొచ్చు.
  • వీడియో కాల్‌లో కొత్త ఎఫెక్ట్‌లను వాట్సప్‌ తీసుకొస్తోంది. కొత్త ఏడాదిలో వీడియో కాల్‌ సమయంలో ఆన్‌ స్క్రీన్‌పై ఫైర్‌వర్క్స్‌, కన్ఫెట్టి (రంగుల కాగితం ముక్కలు), స్టార్స్‌ వంటి ఎఫెక్ట్స్‌ను జోడించొచ్చు.
  • ఏదైనా సందేశానికి కన్ఫెట్టి ఎమోజీ జోడించినప్పుడు ఒక ప్రత్యేక యానిమేషన్‌ దర్శనమిస్తుంది.
  • స్టేటస్‌ విభాగంలోనూ తొలిసారి యానిమేటెడ్‌ స్టిక్కర్లను జోడిస్తున్నట్లు వాట్సప్‌ తెలిపింది. కాంటాక్టులో ఉన్న వ్యక్తులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేలా ఈ స్టిక్కర్లను వినియోగించొచ్చని పేర్కొంది.
  • నూతన సంవత్సరం వేడుకల వేళ ఈవెంట్లను మరింత పకడ్బందీగా ప్లాన్‌ చేసుకోవడానికి ఈవెంట్‌ ప్లాన్‌, పోల్స్‌, లైవ్‌ లొకేషన్‌, వాయిస్‌/ వీడియో నోట్స్‌ను ఉపయోగించుకోవాలని యూజర్లకు సూచించింది.