2025లో మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు పైకి

2025లో మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు పైకి

Year Ender 2025 | దిల్లీ: విదేశీ మదుపర్ల అమ్మకాలు, టారిఫ్‌ల ఒత్తిడులు, రూపాయి పతనం వంటి ప్రతికూలతల నడుమ దలాల్‌ స్ట్రీట్‌ మదుపర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 2025 క్యాలెండర్‌ సంవత్సరంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 8 శాతం పెరిగి మదుపర్లకు రూ.30.20 లక్షల కోట్ల ప్రతిఫలాన్ని అందించింది. దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, దేశీయ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ఇది సాధ్యమైందని అనలిస్టులు పేర్కొంటున్నారు.

2025లో డిసెంబర్‌ 29 వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 8.39 శాతం వృద్ధితో 6,556.53 పాయింట్లు పెరిగింది. డిసెంబర్‌ 1న అత్యధికంగా 86,159.02 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ రికార్డు గరిష్ఠాలను అందుకుంది. డిసెంబర్‌ 29 వరకు బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.30 లక్షల కోట్లు (రూ.30,20,376.68) పెరిగి రూ.472 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారి బీఈఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.400 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.

  • 2024లో సెన్సెక్స్‌ 8.16 శాతం వృద్ధితో 5,898.75 పాయింట్లు పెరిగింది. ఆ ఏడాది బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.77.66 లక్షల కోట్లు వృద్ధి చెందింది.
  • 2023లో బీఈఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.81.90 లక్షల కోట్లు వృద్ధి నమోదైంది.

    2025లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ల నుంచి సుమారు రూ.1.6 లక్షల కోట్లను విదేశీ మదుపర్లు తరలించారు. అయినప్పటికీ దేశీయ మదుపర్ల మద్దతు, స్థిరమైన వృద్ధి, ప్రభుత్వ మూలధన వ్యయం వంటివి మన మార్కెట్‌ను నిలబెట్టాయని స్టాక్స్‌కార్ట్‌ సీఈఓ ప్రణయ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీనికితోడు టాటా క్యాపిటల్‌ (రూ.15,512 కోట్లు), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (రూ.12,500 కోట్లు), ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా (రూ.11,607కోట్లు), హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ (రూ.8,750కోట్లు), లెన్స్‌కార్ట్‌ (రూ.7,278 కోట్లు), గ్రో (రూ.6632 కోట్లు) వంటి ఐపీఓలు కూడా మార్కెట్స్‌ పెరగడానికి దోహదం చేశాయి. దీర్ఘకాలంలో మన మార్కెట్లు మెరుగైన ప్రతిఫలం ఇస్తుందన్న అంచనాలతో సిప్‌ ఇన్‌ఫ్లోస్‌ పెరిగాయి. దీంతో రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యం కూడా తోడైంది.

    రిలయన్స్‌దే టాప్‌

    2025లో అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీల జాబితాలో రిలయన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. రూ.20,91,173 కోట్ల మార్కెట్‌ విలువ దీని సొంతం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.15,25,457.75 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌ (రూ.11,86,978.75 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (రూ.11,77,199.05 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.9,60,478.36 కోట్లు) టాప్‌-5 స్థానాల్లో నిలిచాయి.