రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు: ఉత్తమ్‌

రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు: ఉత్తమ్‌

హైదరాబాద్: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చెప్పిందన్నారు. నీటి వాటాలపై అసెంబ్లీలో శుక్రవారం చర్చ జరగనున్న దృష్ట్యా ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం మంత్రి ఉత్తమ్ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇతరపథకాలపై ఉత్తమ్‌ వివరణ ఇచ్చారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.80 వేల కోట్లకుపైగా కావాలి. రూ.80వేల కోట్ల ప్రాజెక్టుపై రూ.27వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? మేం వచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం తట్టెడు మట్టి తీయలేదని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోంది’’ అని ఉత్తమ్ మండిపడ్డారు.