భోలే బాబా సంస్థ పేరు మార్పులో మతలబు - భారీ నెయ్యి మోసానికి అదే కారణం
వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ - సహకార డెయిరీలు టెండర్లలో పాల్గొనకుండా చేసిన వైనం - అన్నీ తెలిసీ తనిఖీ బృందాల తప్పుడు నివేదికలు - సిట్ దర్యాప్తులో వెల్లడి
మొదట్లో హర్ష్ డెయిరీ పేరుతో ఓ సంస్థ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది. ఆ తర్వాత భోలే బాబా సంస్థగా పేరు మార్చుకుని ఏమార్చినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నిబంధనలను విస్మరించి ప్రైవేటు డెయిరీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సహకార డెయిరీలను టెండర్లలో పాల్గొనకుండా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు డెయిరీల సాంకేతిక అర్హతలను నిర్ధారించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు భోలే బాబా డెయిరీకి అనుకూలంగా పదేపదే తప్పుడు నివేదికలు సమర్పించి, ఆ సంస్థ టెండర్లను దక్కించుకునేలా చేశాయి.
నెయ్యి కొనుగోలుకు సంబంధించిన టెండర్ నిబంధనల్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు 2019 ఏప్రిల్‌లో అప్పటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అప్పట్లో టీటీడీ అధికారులు, డెయిరీ రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. నేషనల్ కేటగిరీ టెండర్లలో పాల్గొనే డెయిరీలకు అర్హత నిబంధనలపై కమిటీ పలు సిఫారసులు చేసింది. దీంతో అంతవరకు రోజుకు కేవలం 6 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలనే నిబంధనను 12 టన్నులకు పెంచింది.
వార్షిక టర్నోవర్‌ను రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచింది. రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలనే నిబంధన పెట్టింది. 2019 ఆగస్టు నుంచి అవి అమల్లోకి వచ్చాయి. కానీ 4 నెలలు గడవక ముందే ఈసారి టెండర్ నిబంధనలన్నీ ప్రైవేటు సంస్థలకు అనుగుణంగా మార్చేందుకు 2020 జనవరిలో మరో కమిటీ ఏర్పాటైంది. అప్పటివరకు ఉన్న రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ నిబంధన తీసేశారు.
కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్న డెయిరీనే టెండర్లలో పాల్గొనాలన్న నిబంధన సంవత్సరానికి తగ్గించారు. అలాగే 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని 8 టన్నులకు తగ్గించారు. వార్షిక టర్నోవర్ సామర్థ్యాన్ని రూ.250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. అసలు పాలే సేకరించని ప్రైవేటు డెయిరీలకు రాచబాట పరిచేందుకు ఈ నిబంధనలు 2020 ఫిబ్రవరి నెలాఖరు నుంచి అమల్లోకి తెచ్చారని సిట్ పేర్కొంది.
తనిఖీ బృందాల తప్పుడు నివేదికలు: డెయిరీలను తనిఖీ చేసి సాంకేతిక అర్హతల్ని నిర్ధారించేందుకు ఏర్పాటైన అధికారులు, నిపుణుల కమిటీలు ప్రలోభాలకు లొంగి కళ్లు మూసుకుని నివేదికలు ఇచ్చాయి. భోలే బాబా డెయిరీకి మొదట్లో ఉన్న పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. హర్ష్ డెయిరీ 2018 నుంచి టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొంటోంది. 2018 ఏప్రిల్ 17న అప్పటి ఈవో ఆదేశాల మేరకు హర్ష్ డెయిరీని తనిఖీ చేసేందుకు కమిటీని సైతం నియమించారు. కొనుగోళ్ల విభాగం జీఎం జి. జగదీశ్వర్‌రెడ్డి, ఎస్వీ గో సంరక్షణశాల డైరెక్టర్ హరనాథ్‌రెడ్డి, డెయిరీ రంగ నిపుణుడు బత్తుల సురేంద్రనాథ్ భగవాన్‌పుర్‌లోని ఆ సంస్థ డెయిరీని సందర్శించారు. ఆ సంస్థ రోజుకు 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని, నిత్యం 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చారు. కానీ హర్ష్ ఫ్రెష్ డెయిరీ అది ఏర్పాటైనప్పటీ నుంచి ఎప్పుడూ ఆవు పాలు సేకరించనేలేదని సిట్ దర్యాప్తులో తేలింది. హర్ష్ డెయిరీ స్వయంగా సేకరించిన పాలతో పాటు, సుందర్, లియాఖత్ డెయిరీల నుంచి పాలు కొంటోందని తనిఖీ బృందం పేర్కొంది.
కానీ ఆ సంస్థల నుంచి హర్ష్ డెయిరీ ఎప్పుడూ పాలు కొనలేదని సిట్ దర్యాప్తులో తేలింది. కమిటీ ఇచ్చిన తప్పుడు నివేదిక వల్ల హర్ష్ డెయిరీ ఫైనాన్షియల్ బిడ్‌కు అర్హత సాధించింది. కానీ ఆ టెండర్ దక్కలేదు. 2019 ఫిబ్రవరి 18న 82 వేల కిలోల ఆవు నెయ్యి కొనుగోలుకు టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ మళ్లీ పాల్గొంది. ఒక్కసారి ఇన్స్పెక్షన్ కమిటీ నివేదిక ఇస్తే ఏడాది పాటు చెల్లుబాటవుతుంది. అంతకుముందు తనిఖీ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసారి ఫైనాన్షియల్ బిడ్కి అర్హత సాధించి టెండర్ దక్కించుకుంది.
2019 ఆగస్టులో మరోసారి ఇన్స్పెక్షన్ కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు పి. జగదీశ్వర్‌రెడ్డి, మద్ది విజయభాస్కర్‌రెడ్డి 2019 ఆగస్టు 6న హర్ష్ డెయిరీని సందర్శించారు. ఆ సంస్థ ఆవు పాలు, ఆవు నెయ్యి వ్యాపారం చేస్తోందే తప్ప, పాల సేకరణ, ఉత్పత్తి చేయడం లేదని ఈసారి నివేదిక ఇచ్చారు. ఆ సంస్థకు సాంకేతిక అర్హత లేదని తేల్చారు. టీటీడీ 2019 సెప్టెంబరులో 70 వేల కిలోల ఆవు నెయ్యి సరఫరా పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ పాల్గొన్నా అర్హత లేదని తోసి పుచ్చారు.
పేరు మార్పుతో మతలబు: హర్ష్ డెయిరీ పేరుతో టెండర్లో పాల్గొని నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకోలేమని అర్థమవడంతో దాని డైరెక్టర్లు డెయిరీ పేరుని 2021 జులైలో భోలే బాబా ఒరొగానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చేశారు. 2021 అక్టోబరులో 25 లక్షల కిలోల నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేసేందుకు టీటీడీ పిలిచిన టెండర్లలో భోలేబాబా పేరుతో పాల్గొన్నారు. ఈసారి తనిఖీకి వెళ్లిన కమిటీ దానికి సాంకేతిక అర్హత ఉందని తేల్చేసింది.
ఆ సంస్థ ఆవుపాలు, వెన్న కొనుగోలు చేసి నెయ్యి ఉత్పత్తి చేస్తున్నట్టు సర్టిఫికెట్ ఇచ్చేసింది. అక్కడ సదుపాయాలు బాగున్నాయని పేర్కొంది. కానీ తనిఖీ బృందం తప్పుడు నివేదిక ఇచ్చిందని, భోలేబాబా సంస్థ ఎప్పటిలానే ఒక్క లీటరు ఆవు పాలు కూడా కొనలేదని దర్యాప్తులో తేలింది. ఆ టెండర్లలో ఎల్-2గా నిలిచిన భోలే బాబా సంస్థ 7,17,500 కిలలో నెయ్యి సరఫరా ఆర్డర్ దక్కించుకుని కల్తీ నెయ్యి సరఫరా చేసింది. అదే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరో 72,450 కిలోల నెయ్యి సరఫరా ఆర్డర్ దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఆ కమిటీ పదే పదే టెండర్లు దక్కించుకుంటూనే ఉంది.


Pratiroju 




