బ్యాంకు ఖాతా లేకుండానే ఎఫ్డీ
డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘అమెజాన్ పే’ తన ఆర్థిక సేవల విస్తరణలో భాగంగా వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఇకపై అమెజాన్ పే ద్వారా వినియోగదారులు నేరుగా ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
రూ.1,000 నుంచీ
అమెజాన్ పే వినియోగదారులు ఈ సేవను పొందేందుకు బ్యాంకుల్లో ప్రత్యేకంగా పొదుపు ఖాతా ప్రారంభించాల్సిన అవసరం లేదు. అమెజాన్ పే యాప్ ద్వారానే, డిజిటల్ పద్ధతిలో డిపాజిట్ చేయొచ్చు. కనీస మొత్తం రూ.1,000. బ్యాంకు, కాలపరిమితిని బట్టి, గరిష్ఠంగా 8% వార్షిక వడ్డీ లభించే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేటుపై అదనంగా 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది.
7 సంస్థలతో ఒప్పందం
ఈ సేవల కోసం అమెజాన్ పే మొత్తం 7 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, స్లైస్ వంటి ఎన్బీఎఫ్సీలు, శివాలిక్, సూర్యోదయ, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సౌత్ ఇండియన్ బ్యాంకు ఉన్నాయి.
శ్రీరామ్ ఫైనాన్స్‌లో డిపాజిట్ చేసే మహిళా మదుపరులకు 0.5% అదనపు వడ్డీ లభిస్తుందని అమెజాన్ పే వెల్లడించింది.
బీమా భరోసా
అమెజాన్ పే భాగస్వామ్య బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు బీమా భద్రత లభిస్తుందని అమెజాన్ పే సీఈఓ వికాస్ బన్సల్ పేర్కొన్నారు.


Pratiroju 




