ప్రపంచానికి భారత్ ఆశాకిరణం- ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికం: మోదీ
అభివృద్ధి ఫలాలు చివరివ్యక్తి వరకు చేరాలన్నదే తమ సంకల్పమన్న ప్రధాని
భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఆకాంక్షల భారత్‌కు, ఆశావహ యువతకు, ఆత్మనిర్భర్ భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్యమని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఒప్పందం భారత్‌ను మరింత ఆత్మవిశ్వాసం గల, పోటీ సామర్థ్యం ఉన్న, ఉత్పాదక దేశంగా మార్చే కీలక అడుగు అని తెలిపారు. శుభసూచికమని కూడా అన్నారు.
భారత తయారీ రంగానికి ఆ ఒప్పందం గొప్ప అవకాశమని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా దేశీయ తయారీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సామర్థ్యాలను పెంచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారత పరిశ్రమలకు ప్రపంచ మార్కెట్లలో మరింత స్థానం దక్కుతుందని, ఇది భారత్‌కు కొత్త శక్తినిస్తుందని చెప్పారు.
భారత్–ఈయూ మధ్య కీలక ఒప్పందాలు
ఇటీవల ప్రధాని మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సమక్షంలో భారత్–ఈయూ మధ్య పలు కీలక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదిరాయి. టువార్డ్స్ 2030 – జాయింట్ ఇండియా–ఈయూ కాంప్రెహెన్సివ్ స్ట్రాటజిక్ అజెండా పేరుతో వ్యూహాత్మక దస్త్రం విడుదలైంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల ముగింపుపై రాజకీయ ప్రకటనను వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్, ఈయూ ట్రేడ్ కమిషనర్ మారోస్ షెఫ్చోవిచ్ సంతకం చేశారు. భద్రత, రక్షణ భాగస్వామ్యం, మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్ వంటి కీలక ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇవన్నీ భారత్–ఈయూ సంబంధాలు మరింత బలపడుతున్నాయని సూచిస్తున్నాయి.


Pratiroju 




