పూర్తయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి - ఇక సాఫీగా ప్రయాణం
గతంలో వాహనదారులకు తప్పని ఇక్కట్లు - హైదరాబాద్ నుంచి బెంగళూరు 44వ జాతీయ రహదారి నుంచి అనంతపురం - చెన్నై వెళ్లే 42వ జాతీయ రహదారికి రాప్తాడు ఆర్వోబీ ఎంతో కీలకం
రాప్తాడు మీదుగా అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలంటే ఒకప్పుడు అందరిలోనూ ఒకింత అసహనం ఉండేది. రాప్తాడు రైల్వేగేటు పడితే పడిగాపులే అన్న భయం వెంటాడేది. అరగంటపాటు అక్కడే ట్రాఫిక్ నిలిచిపోయేది. డబుల్ ట్రైన్ వచ్చినప్పుడు ఈ మార్గంలో వాహనదారుల సహనానికి పరీక్షలా ఉండేది. వాహనదారులకు ఈ మార్గం చికాకు కల్గించేది. జాతీయ ఉపరితల రోడ్డు రవాణా సంస్థ మంజూరు చేసిన ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రయాణం సాఫీగా సాగిపోనుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక వాహనదారులు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఈ మార్గంలో ప్రయాణించవచ్చు.
వాహనదారులకు తప్పని ఇక్కట్లు : గతంలో నేషనల్ హైవే 44 మీదుగా బెంగుళూరు, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు పంగల్ రోడ్డు మీదుగా వెళ్లేవి. అక్కడి నుంచి చెన్నై నేషనల్ హైవే, అనంతపురం నగరంలోకి వెళ్లాలంటే రాప్తాడు రైల్వే గేటు తప్పనిసరిగా దాటాలి. చెన్నై హైవే నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాలంటే ఈ రైల్వే గేటు దాటాల్సిందే. ఈ క్రమంలో బస్సులు, లారీలు, పెద్ద వాహనాలు, ఏ వాహనాలైనా ఈ రైల్వే గేటు దాటుకుని వెళ్లాల్సిందే. అయితే రైలు వచ్చే సమయంలో గేటు వేస్తే పెద్దఎత్తున వాహనాలు ఇరువైపులా ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆర్వోబీ పనులు సరిగ్గా జరగకపోవడం వల్ల కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అటువంటి సమస్యకు, ప్రమాదాలకు తావు లేదు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పుర్తయ్యాయి. ఇక వాహనదారులు ఈ మార్గంలో సాఫీగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
రాప్తాడు ఆర్వోబీ ఎంతో కీలకం : హైదరాబాద్ నుంచి బెంగళూరు 44వ జాతీయ రహదారి నుంచి అనంతపురం - చెన్నై వెళ్లే 42వ జాతీయ రహదారికి రాప్తాడు ఆర్వోబీ ఎంతో కీలకంగా మారింది. 2018లో టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి రూ.54.78 కోట్లతో ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పనులు దక్కించుకున్న గుత్తేదారుడిని వైఎస్సార్సీపీ నాయకులు కమీషన్లు డిమాండ్ చేయడంతో గుత్తేదారుడు పనులు అక్కడికక్కడ నిలిపివేసి వెళ్లిపోయాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోయాయి. దీనితో పిల్లర్ల దశలోనే నిర్మాణ పనులు అన్నీ ఆగిపోయాయి.
ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో : గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో దాదాపు మూడేళ్లపాటు రీ టెండర్ నిర్వహించకపోవడంతో పనులు అన్నీ నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నిర్మాణానికి రీ టెండరు నిర్వహించారు. రూ.24 కోట్లకు పనులు దక్కించుకున్న శ్రీకృష్ణదేవరాయ సంస్థ గుత్తేదారు 2025 ఆగస్టులో ఈ నిర్మాణ పనులు ప్రారంభించారు.
చివరి దశకు చేరుకున్న పనులు : ఈ నిర్మాణ పనులు తొమ్మిది నెలల వ్యవధిలోపు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జి, సర్వీసు రోడ్లు, కందుకూరు రోడ్డులో జంక్షన్ నిర్మాణ పనులు మాత్రమే మిగిలాయి. ఇది కూడా పూర్తయితే రెండు జాతీయ రహదారులకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడనుంది. ఆర్వోబీపై జనవరి నెలాఖరున రాకపోకలు సాగించేలా పనులు పూర్తి చేశామని జాతీయ రహదారుల విభాగం ఏఈ లక్ష్మీనరసయ్య తెలిపారు.


Pratiroju 




