జల వలయం.. నగరానికి అభయం
ఈనాడు, హైదరాబాద్: వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో అన్ని ప్రాంతాలకు అంతరాయం లేని తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు జలమండలి భారీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలవనరులను అనుసంధానం చేస్తూ నగరం చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో రేడియల్ రింగ్ మెయిన్‌ను ఏర్పాటు చేయనుంది. రింగ్ మెయిన్‌ను అనుసంధానం చేస్తూ మరో 96 కిలోమీటర్ల మేర పైపులైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. రూ.8 వేల కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు జలమండలి ప్రకటించింది.
రింగ్ మెయిన్ అంటే?
నగరానికి అంతరాయం లేని నీటి సరఫరా కోసం ఏర్పాటు చేయనున్న ప్రధాన పైప్‌లైన్ నెట్వర్క్ రింగ్ మెయిన్. ప్రధానంగా ఓఆర్ఆర్ వెంబడి దీన్ని ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. రింగ్ మెయిన్‌కు అనుసంధానంగా వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా పైపులైన్లు ఏర్పాటు చేస్తారు.
ఎందుకోసం..?
రాజధానికి తొలుత జంట జలశయాల నుంచి తాగునీరు అందేది. తర్వాత సింగూరు, మంజీరా తోడయ్యాయి. తాగునీటి అవసరాలు పెరగడంతో కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా మంజీరా పైపులైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి. కృష్ణా, గోదావరి పైపులైన్లకు ఆటంకం ఏర్పడినా, ఇతర సమస్యలు ఎదురైనా సరఫరాకు అంతరాయం తప్పడం లేదు. నగరానికి నీటిని అందించేందుకు వనరులు ఉన్నా అనుసంధానం కాకపోవడంతో పలు ప్రాంతాలపై ప్రభావం పడుతోంది.ఏ ప్రాంతంలోనూ అంతరాయంలేని నీటి సరఫరాకు రింగ్ మెయిన్ ఉపకరిస్తుందని జలమండలి ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. మరో రెండేళ్లలో గోదావరి 2, 3 దశలు అందుబాటులోకి వస్తుండటంతో అన్ని వనరులను రింగ్‌మెయిన్ ద్వారా అనుసంధానం చేస్తే నీటిని అందించేందుకు సానుకూలత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రయోజనాలు
- ఒక ప్రాంతంలో మరమ్మతులు ఏర్పడినా.. ఇతర ప్రాంతాలపై ప్రభావం పడకుండా నీటిని అందించడం.
- 24 గంటల నీటి సరఫరా లక్ష్యంలో కీలకమైన వ్యవస్థ.
- అన్ని ప్రాంతాలకు సమాన ఒత్తిడితో నీరు అందించడం


Pratiroju 




