కోటి ఉద్యోగాల కొత్త సంవత్సరం
కొత్త ఏడాదిలో భారీ సంఖ్యలో నియామకాలకు దేశంలోని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఉద్యోగాల సృష్టి అధికంగా ఉండొచ్చని స్టాఫింగ్ సేవల సంస్థ టీమ్‌లీజ్ అంచనా వేస్తోంది. బృందాల విస్తరణ, క్యాంపస్ నియామకాల పునరుద్ధరణ, వైవిధ్యమైన లక్ష్యాలపై కంపెనీలు దృష్టి పెట్టడం ఇందుకు కారణమని చెబుతోంది.
అన్ని విభాగాల్లోనూ సందడి
2026లో 1-1.2 కోట్ల ఉద్యోగాలను దేశీయ కార్పొరేట్ రంగం సృష్టించొచ్చని పేర్కొంది. 2025లో ఈ అంచనా 80 లక్షలు - కోటి మధ్య ఉంది. కొత్త నైపుణ్యాలకు ఉన్న గిరాకీకి అనుగుణంగా నియామక ప్రణాళికలను కంపెనీలు విస్తృతం చేస్తున్నాయని, అదే సమయంలో అన్ని విభాగాల్లో ఉద్యోగులను పెంచుతున్నట్లు హెచ్ఆర్ వర్గాలు వెల్లడించాయి.
ఈవై ఇండియాలో..
భారీ సంఖ్యలో నియామకాల కోసం చూస్తున్న సంస్థల్లో నైపుణ్య సేవల కంపెనీ ఈవై ఇండియా ఉంది. 2026 జూన్ కల్లా 14,000- 15,000 మందిని నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ అధికారి ఆర్తి దువా తెలిపారు. కంపెనీకి క్యాంపస్ నియామకాలు ఎప్పుడూ కీలకమన్నారు. బిజినెస్ స్కూల్స్, ఇంజినీరింగ్ కళాశాలలు, లా కాలేజీలు, అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాల నుంచి ఏటా 2,000 మందిని కంపెనీ నియమించుకుంటుంది. ప్రస్తుతం కంపెనీకి దేశంలో 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
డియాజియోలో..
డిజిటల్, సరఫరా కార్యకలాపాలు, విభాగాల విస్తరణ వంటి వృద్ధికి సంబంధించిన అంశాల్లో సామర్థ్యాలకు అనుగుణంగా నియామకాలు ఉంటాయని డియాజియో ఇండియా సీహెచ్ఆర్ఓ శిల్పా పేర్కొన్నారు. లింగ వైవిధ్యాన్ని మెరుగుపరచాలని కంపెనీ చూస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల్లో 30%, నాయకత్వ పదవుల్లో 31% చొప్పున మహిళలు ఉన్నారు.
ఇతర కంపెనీలు సైతం..
- వర్ధమాన, భవిష్యత్‌కు అవసరమైన ఉద్యోగుల నియామకాలకు టాటా మోటార్స్ మొగ్గుచూపుతోంది. బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ, వాణిజ్య కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో నియామకాలపై దృష్టి పెట్టింది.
- నియామకాల వ్యూహంలో భాగంగా వైవిధ్యమైన శ్రామికశక్తిని గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ ఆశిస్తోంది. దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూ, సిస్ మహిళల ప్రాతినిధ్యాన్ని 31% నుంచి 2026-27కు 33 శాతానికి పెంచాలని భావిస్తోంది.
- టెక్, డేటా సైన్స్, ఏఐ, సపోర్ట్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. నాయకత్వ పదవుల్లో మహిళలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది.
- కొత్త నియామకాలతో పాటు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడానికి పెట్టుబడులు కొనసాగిస్తామని ఎక్కువ శాతం కంపెనీలు స్పష్టం చేశాయి


Pratiroju 




