కొత్త డీమ్యాట్‌ ఖాతాల కళ తగ్గింది

కొత్త డీమ్యాట్‌ ఖాతాల కళ తగ్గింది

 కరోనా తర్వాత స్టాక్‌ మార్కెట్‌ను ముంచెత్తిన కొత్త డీమ్యాట్‌ ఖాతాల ప్రవాహానికి 2025లో అడ్డుకట్ట పడింది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో నమోదైన ఖాతాల వృద్ధి రేటు ఇప్పుడు నెమ్మదించింది. గతేడాది కొత్త డీమ్యాట్‌ ఖాతాల వృద్ధి రేటు గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి పడిపోయింది. మార్కెట్లో చురుగ్గా లావాదేవీలు జరిపే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

పసిడి, వెండి వైపు..: భారత ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చితి, కొత్త మదుపరులపై ప్రభావం చూపుతోంది. మరోవైపు బంగారం, వెండి మిలమిలా మెరుస్తూ లాభాలను పంచాయి. దీంతో మదుపరులు గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారని యాంఫీ తాజా నివేదిక స్పష్టం చేసింది. వీటిన్నింటి ప్రభావంతో కొత్తగా ప్రారంభమయ్యే డీమ్యాట్‌ ఖాతాల వృద్ధి రేటు 2024తో పోలిస్తే 2025లో సగానికి పైగా పడిపోయింది.

కొత్తవి 3 కోట్లే..: డిపాజిటరీల గణాంకాల ప్రకారం 2024లో దేశ వ్యాప్తంగా 4.60 కోట్ల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభం అయ్యాయి. 2025లో ఈ సంఖ్య కేవలం 3.06 కోట్లకు పరిమితమైంది. డిసెంబరు 31 నాటికి మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 21.6 కోట్లకు చేరుకుంది. వాస్తవానికి కరోనా తర్వాత స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడం, ఖాతా ప్రారంభ ప్రక్రియ సులభతరం కావడంతో గడిచిన అయిదేళ్లలో డీమ్యాట్‌ ఖాతాలు నాలుగు రెట్లు పెరిగాయి. 2020లో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య సుమారు 5 కోట్లే కావడం గమనార్హం.

మార్కెట్లో ప్రతికూలతలు: గతేడాది భారత ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. ముఖ్యంగా భారత్‌పై అమెరికా సుంకాలను విధించడంతో వాణిజ్య పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు కంపెనీల ఆదాయాలూ ఆశించిన స్థాయిలో లేవు. గణాంకాల ప్రకారం 2025లో సెన్సెక్స్‌   9.06 శాతం, నిఫ్టీ 10.5 శాతం మేరకు లాభాలు ఇచ్చాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌-100 సూచీ  5.7 శాతం పెరగ్గా, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌-100 5.62 శాతం నష్టపోయింది. మార్కెట్‌లోని అగ్రశ్రేణి సంస్థల్లో దాదాపు 60 శాతం షేర్లు మదుపరులకు నష్టాన్నే మిగిల్చాయి.

ఐపీఓలతో..: మార్కెట్లోకి వస్తున్న కొత్త ఐపీఓలే కొత్త డీమ్యాట్‌ ఖాతాలకు కారణం అవుతున్నాయి. ఐపీఓ కేటాయింపుల్లో షేర్లు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు చాలామంది తమ కుటుంబ సభ్యుల పేరుతో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలను ప్రారంభించారని నివేదికలు పేర్కొంటున్నాయి.