TTD: వైకుంఠద్వార దర్శనం.. విద్యుద్దీపకాంతుల్లో తిరుమల
తిరుమల: వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుద్దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తితిదే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అలంకరణలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని చూడచక్కగా ముస్తాబు చేశారు. వైకుంఠ ప్రదర్శన మార్గంలోని అలంకరణకు ప్రత్యేకమైన పూలను వినియోగించారు. శ్రీవారి ఆలయం ఎదుట అలంకరణ భక్తులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాకారాలు, గోపురాలు రంగురంగుల విద్యుద్దీపాలతో మిరమిట్లు గొల్పుతున్నాయి. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులు దైవలోకాన్ని చూసిన అనుభూతి పొందేలా తితిదే ముస్తాబు చేసింది.


Pratiroju





