బాలయ్యకు ఓ న్యాయం.. జగన్ కు ఓ న్యాయమా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరిందని, దీనిపై పార్టీ ముందుండి పోరాడుతోందని అన్నారు. వ్యవస్ధలను నిర్వీర్యం చేయడం, నిరంకుశ పాలన, నియంత పాలనను తెలుగుదేశం పార్టీ అమలుచేస్తుందని ఆరోపించారు.
పార్టీ లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్‌లు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులతో సజ్జల జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుగా పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ వికృత పాలన అందిస్తోందని విమర్శించారు. వందల కొద్ది తప్పుడు కేసులు పెట్టి పార్టీ శ్రేణులను వేధిస్తోందని, జగన్ పుట్టినరోజు వేడుకలను కూడా తట్టుకోలేక బరితెగించి నడిరోడ్డుపై నడిపిస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో అరాచకాలు జరిగిన చోట మాత్రం పోలీసుల జాడ ఉండదని, జగన్ బర్త్ డే నాడు కేక్ కట్ చేసిన అభిమానులపై కేసులు పెట్టి నడిరోడ్డుపై నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. బాలకృష్ణ సినిమాకు పొట్టేళ్ళ తలలతో హారం వేసి చేసినప్పుడు మాత్రం ఎలాంటి కేసులు ఉండవని, ఇదెక్కడి న్యాయమో అర్ధం కావడం లేదని సజ్జల అన్నారు. దీనికితోడు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఏకంగా రాజద్రోహం కేసులు సైతం నమోదు చేస్తోన్నారని మండిపడ్డారు.
రోడ్లపై నడిపించడాన్ని డీజీపీ సమర్ధిస్తోన్నారని సజ్జల అన్నారు. ఇలాంటి విపరీతమైన పోకడలతో టెర్రరైజ్ చేయడమే లక్ష్యంగా చేస్తోన్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి ఇలా బరితెగించి వ్యవహరిస్తున్నారని, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి పార్టీ అభిమానులు, కార్యకర్తలను నడిరోడ్డుపై నడిపిస్తోన్నారని ఆయన ఆరోపించారు.
పార్టీ లీగల్ సెల్ లో ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సజ్జల సూచించారు. పార్టీ కార్యకర్తలను రోడ్లపై నడిపించడంపై లీగల్ సెల్ మరింతగా అప్రమత్తం కావాలని అన్నారు. పోలీసులు చేస్తున్నది తప్పు అనే విషయాన్నిప్రజల్లోకి తీసుకెళ్ళాలని, అవసరమైతే ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సమాచారం డిజిటలైజ్ చేయడం వల్ల భవిష్యత్ లో ఉపయోగించుకోవచ్చని అన్నారు.


Pratiroju 




