పంత్‌.. టెస్టుల్లో ఓకే..! తెల్ల బంతితోనే తేలిపోతున్నాడు!

పంత్‌.. టెస్టుల్లో ఓకే..! తెల్ల బంతితోనే తేలిపోతున్నాడు!

రిషభ్ పంత్‌ (Rishabh Pant).. ఈ పేరు చెబితే చాలు.. బౌలర్లకు హడల్‌. అసలేమాత్రం బెరుకు లేకుండా.. అటాకింగ్‌  షాట్లతో విరుచుకుపడతాడు. అలాగే అతడు తనకు మాత్రమే ప్రత్యేకమైన షాట్లనూ ఆడగలడు! క్రికెట్‌ బుక్‌లోనూ లేని బ్యాటింగ్‌ విన్యాసాలూ చేసి చూపించగలడు! టెస్ట్‌ జట్టులో రిషభ్‌ పంత్‌కు ఇప్పటి వరకైతే ఏ ఢోకా లేదు! అయితే కొంతకాలంగా అతడు వైట్‌ బాల్‌ క్రికెట్‌కే దూరమవుతున్నాడు.

టీ20 వరల్డ్‌ కప్ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన జట్టులోనూ అతడి పేరు లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ఇండియా స్వ్కాడ్‌లో అతడి పేరున్నా.. తుది జట్టులో చోటే దక్కలేదు. అలాగే న్యూజిలాండ్‌ జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ (BCCI) ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. అయితే పంత్‌కు ఈ సిరీస్‌లో అవకాశం దక్కేలా లేదని వార్తలూ వస్తున్నాయి. ఒక వేళ టీమ్‌లోకి తీసుకున్నా.. తుది జట్టులో ఉంటాడా? అన్నదీ అనుమానంగానే కనిపిస్తోంది! 

చివరిసారిగా.. 2024లో!

రిషభ్‌ పంత్‌.. అంతర్జాతీయ వన్డేలు, టీ20లు ఆడి సంవత్సరం గడిచిపోయింది. అతడు తన చివరి వన్డే 7 ఆగస్టు 2024న ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో ఆడాడు. అలాగే చివరి టీ20 28 జులై 2024న పల్లెకెలె ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా అదే దేశంపై ఆడాడు. ఆ తర్వాత నుంచి మైదానంలోకి దిగలేదు. నిలకడలేమి, ఫామ్‌ కోల్పోవడం, జట్టు అవసరాలను అనుగుణంగా పరుగులు చేయలేకపోవడం వల్ల పంత్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు!