గోదావరి పుష్కరాలు - గోష్పాద క్షేత్రంలో ఇంకా మొదలుకాని పనులు
పవిత్రమైన క్షేత్రంలో అపరిశుభ్రంగా పరిసరాలు - ప్రమాదకర పరిస్థితులకు నెలవు - 250 పాత ఘాట్లకు మరమ్మతులు చేయాలని జలవనరుల శాఖ అధికారుల ప్రతిపాదనలు
గోదావరిలో నిత్యం విశేష సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకునే దివ్య ధామం కొవ్వూరు గోష్పాద క్షేత్రం. ఇంతటి పవిత్రమైన క్షేత్రం అపరిశుభ్ర పరిసరాలు, ప్రమాదకర పరిస్థితులకు నెలవుగా మారింది. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి మహా పుష్కరాల్లో రాజమహేంద్రవరంతో పాటు ఆవలి ఒడ్డున ఉన్న కొవ్వూరు ఘాట్లు కీలకంగా మారనున్నాయి. ఈ పరిస్థితుల్లో తీరం అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాకపోవటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోట్ల మంది భక్తుల రాక: గోదావరి మహా పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి 12 రోజులపాటు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. కోట్ల మంది భక్తులు తరలివచ్చి అఖండ గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంతో పాటు వివిధ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ మహాక్రతువు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు అవసరమవుతాయి. రాజమహేంద్రవరానికి ప్రత్యామ్నాయంగా విజయవాడ తెలంగాణ వైపు నుంచి వచ్చే భక్తులు కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఈసారి ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. గోష్పాద క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


Pratiroju 




