కోర్టుతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా?
ఈనాడు, అమరావతి: ‘ఈ ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానంతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా? అదే మీ ఆలోచన అయితే, మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు’ అని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వుల అమల్లో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆదేశాలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహించింది. శక్తిమంతమైన వ్యక్తి కింద పని చేస్తున్నందున తమను ఎవరూ ఏమి చేయలేరనే ఉద్దేశంతో ఉన్నట్లు కన్పిస్తోందని వ్యాఖ్యానించింది. విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతోందని, కోర్టు ఆదేశాలు, ఉన్నతాధికారులు కోర్టుకిచ్చిన హామీలను దిగువస్థాయి సిబ్బంది తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) బి.శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. నోటీసులు జారీచేస్తూ, ఫిబ్రవరి 4న స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
విజయనగరం ఏపీడీ చర్యల ఫలితం
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ)గా పనిచేస్తున్న తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు 2023లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఆ టీచర్లను తొలగించిన స్థానంలోనే తిరిగి కొనసాగించాలని ఆదేశించారు. ఒప్పందం ముగిశాక కూడా వారిని పీజీటీలుగా కొనసాగించడంపై పరిశీలించాలని 2023 డిసెంబర్లో ఉత్తర్వులిచ్చారు. ఈ తీర్పును సవాలుచేస్తూ అధికారులు అప్పీల్ వేశారు. సోమవారం జరిగిన విచారణలో పీజీటీల తరఫు న్యాయవాది జై భీమారావు వాదిస్తూ, ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇటీవల జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ఇదే ధర్మాసనం ముందు హామీ ఇచ్చారు.
అందుకు భిన్నంగా విజయనగరం అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యవహరించారు. పీజీటీలను వేర్వేరు స్థానాలకు బదిలీ చేశారు. నిర్దిష్ట వేతనం ఇవ్వకుండా గంటల చొప్పున జీతం నిర్ణయించారు’ అని పేర్కొన్నారు. విద్యాశాఖ జీపీ గుర్రం రామచంద్రరావు స్పందిస్తూ, ‘కోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని సర్వశిక్షా అభియాన్ పీడీ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు. విజయనగరం అదనపు పీడీ చర్యలకు.. రాష్ట్ర పీడీని బాధ్యుడిని చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆదేశాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, అవి అమలయ్యేలా చూడాల్సింది రాష్ట్ర పీడీయేనని స్పష్టం చేసింది. సుమోటోగా అతనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసులిచ్చింది.


Pratiroju 




